సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాపై బదిలీ వేటుపడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలిఫోన్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రెహానాను ప్రస్తుతమున్న కేరళలోని బోట్ జెట్టీ బ్రాంచ్ నుంచి పలరివట్టం టెలిఫోన్ ఎక్సేంజ్ శాఖకు బదిలీ చేస్తూ ఆ సంస్థ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఆలయ ప్రవేశం వివాదం కారణంగానే కస్టమర్ రిలేషన్ సెక్షన్‌లో టెక్నిషియన్ అయిన రెహానాను, ప్రజలతో పెద్దగా సంబంధం ఉండని పలరివట్టంలోని వేరే శాఖకు బదిలీ చేసినట్టు సమాచారం. కాగా రెహానా ఇక్కడ కూడా పనిచేయకుండా బహిష్కరించాలని కోరుతూ శబరిమల కర్మ సమితి మంగళవారం పలరివట్టంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది.
అయితే రెహానా ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఉద్యోగాన్ని వదులుకోబోదని ఆమె సన్నిహితుల చెబుతున్నారు. దీనిపై రెహానా నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నలుగురు మహిళలు మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు.