ఉరిశిక్ష లాంటి కేసులను దీర్ఘకాలం సాగదీయొద్దు: మాయావతి

గురువారం, 30 జులై 2015 (18:50 IST)
ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరితీతపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. మరణశిక్ష లాంటి కే్సులను దీర్ఘకాలం సాగదీయకూడదని మాయావతి అభిప్రాయపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యాకూబ్ కేసులో చట్టపరంగా జరగాల్సినవన్నీ జరిగాకే అతడికి ఉరిశిక్షను అమలు చేశారన్నారు. 
 
అయితే ఉరిశిక్ష లాంటి కేసులను దీర్ఘకాలం సాగదీయడం మంచిదికాదని మాయావతి పేర్కొన్నారు. ప్రభుత్వం కాని, న్యాయస్థానాలు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరతగతిన కేసుల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అంతేకాక తీవ్రమైన కేసుల్లో పక్షపాతరహితంగా వ్యవహరించడం వల్ల చట్టం అందరికీ ఒకటే అన్న భావం ప్రజల్లో నెలకొంటుందని మాయావతి అన్నారు. ఉరిశిక్ష వంటి కేసుల్లో ఒక నిర్దిష్ట గడువు విధించుకుని ఆలోపుగా చట్టపరంగా అన్ని చర్యలు పూర్తిచేస్తే బాగుంటుందని సూచించారు. కేసులు చాలాకాలం పాటు నడుస్తుండడం వలన ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి