రెండువేల నోట్లు మొత్తం మింగేశారు... డిపాజిట్లు లేని బ్యాంకులు.. అల్లాడుతున్న జనం
బుధవారం, 8 మార్చి 2017 (05:05 IST)
ఒక్కమాటలో చెప్పాలంటే దేశం మళ్లీ మూడు నెలల వెనక్కి వెళ్లిపోయింది. దేశీయ బ్యాంకుల్లో మళ్లీ డబ్బులు నిండుకున్నాయి. బ్యాంకుల్లో నిన్నామొన్నటివరకు ఎంతో కొంత మొత్తంలో ఉన్న డిపాజిట్లను ఊడ్చేశారు, ఇంతవరకు 40 వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయలను రిజర్వ్ బ్యాంకు చెస్ట్‌లు బ్యాంకులకు సరఫరా చేస్తే ఇప్పుడు అన్ని బ్యాంకుల వద్దా ఉన్నది అయిదు లేదా పది వేల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లే.. 2019 ఎన్నికలకోసం రాజకీయ నేతలు, అక్రమార్కులు, దళారీలు ఇన్నాళ్లుగా బ్యాంకుల్లో చిక్కుకున్న డబ్బులను లాగేయడంతో నగదు కొరత మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు జనం పాడుతున్న అన్నమో రామచంద్రా కాదు డబ్బులో రామచంద్రా.. డబ్బుల్లేవ్ రామచంద్రా..
ఎందుకిలా జరిగింది. నవంబరు 8నపెద్ద నోట్లను రద్దు చేసినపుడు జనవరి 1 నుంచి నోట్ల కష్టాలుండవని ప్రధాని చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఎంత నగదు కావాలంటే అంత ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇవ్వాళ చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బుల్లేవు.. బ్యాంకుల్లో డబ్బుల్లేవు! చేతుల్లో డబ్బుల్లేవు! నగదుకు మళ్లీ కట కట!! తెలుగు రాష్ట్రాల్లో నోట్ల రద్దు ప్రభావం కొనసాగుతోంది. ఏటీఎంల్లో ‘నో క్యాష్’ బోర్డులు కొనసాగుతున్నాయి. బ్యాంకుకు వెళితే చెస్ట్ నుంచి డబ్బులు రాలేదన్నదే జవాబు! సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. పింఛన్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.
దీనంతటికీ కారణం రిజర్వ్ బ్యాంక్ చేతకానితనమా.. లేక నగదు ఎలా వాడతారో చూస్తామంటూ ప్రదర్శిస్తున్న ఆర్బీఐ పరమ నిర్లక్ష్య ధోరణా.. బ్యాంకర్లే నేడు ఆర్బీఐపై మండిపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. డబ్బులు లేవంటూ బ్యాంకులే చేతులు ఎత్తేస్తున్నాయి. చెస్ట్‌లకు వెళ్లినా ముప్పతిప్పలు పెడుతున్నారని బ్యాంకర్లే గగ్గోలు పెడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చేసిన డిపాజిట్లను కూడా విడుదల చేయడం లేదని తప్పుబడుతున్నారు. నాటి డిపాజిట్లలో 25-50 శాతం మాత్రమే విడుదల చేసిందని విమర్శిస్తున్నారు.
పెద్ద నోట్ల రూపంలో 86 శాతం నగదును రద్దు చేస్తే ముద్రించింది 60 శాతమే. అధిక శాతం ప్రభుత్వ వ్యతిరేకత భయంతో ఎన్నికల రాష్ట్రాలకు పంపిస్తున్నారు. అతి తక్కువ మొత్తంలో మాత్రమే తెలుగు రాష్ట్రాలకు వస్తోంది. నగదు కొరతకు ఇది ప్రధాన కారణమని చెబుతున్నారు. డబ్బుల కోసం వెళితే నగదు రహిత లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతోనే పెద్ద నోట్లను రద్దు చేశామని, ఇప్పుడు వాటిని పెంచాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఆర్‌బీఐ బ్యాంకర్లకు చెబుతోంది. ఆర్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై చార్జీలను యథాతథంగా ఉంచడంతో నగదుకే ఖాతాదారులు మొగ్గు చూపుతున్నారు.
బ్యాంకుల్లో నగదు కొరతకు మరో ప్రధాన కారణం డిపాజిట్లు వెనక్కి తీసుకోవడమని బ్యాంకర్లు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులంతా పెద్ద ఎత్తున మొత్తాలను బ్యాంకుల్లో వేశారు. ఇప్పుడు ఆ డబ్బులన్నిటినీ డ్రా చేస్తున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన డిపాజిట్లలో 60 శాతం వివిధ రూపాల్లో బయటకు వెళ్లిపోయాయి. వితడ్రా అయిన సొమ్ములు మళ్లీ మార్కెట్లోకి చలామణిలోకి రావడం లేదు. దాంతో, నగదుకు కటకట ఏర్పడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జరిగే లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలువురికి ఐటీ నోటీసులు, మొయిల్స్ వస్తున్నాయి. బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు ఐటీకి లెక్కలు చెప్పడం కష్టమవుతోందని 80 శాతం వ్యాపారులు నగదు లావాదేవీలకే ఆసక్తి చూపుతున్నారు.
బ్యాంకు నుంచి బయటకు వెళ్లిన 2000 నోటు తిరిగి రావడం లేదని, నగదు కొరతకు ఇది మరొక కారణమని వివరిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.50 వేల కోట్ల విలువైన 2000 నోట్లను పంపిణీ చేశారు. బ్యాంకులు, మార్కెట్లో చలామణిలో ఉన్నవి 5-10 వేల కోట్లే. మిగిలిన 40 వేల కోట్లు భోషాణాల్లో చేరిపోయాయి. ఈ సొమ్మునంతా 2019 ఎన్నికల కోసం దాచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనం కూడా జాగ్రత్త పాటిస్తున్నారు. ఖర్చు కార్డుల్లో పెడుతూ క్యాష్ దాచుకుంటున్నారు. బ్యాంకుల నుంచి బయటకు వెళ్లిన నగదు తిరిగి అదే స్థాయిలో డిపాజిట్ కానపుడు నగదు కొరత తప్పదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్ అంటూ కర్ణుడి చావుకు ఆరుగురు కారణమని మహాభారతంలో సుప్రసిద్ధ పద్యముంది. మరి జనం చావులకు, బాధలకు, డబ్బు కటకటలకు ఎవరు కారణం అంటే మొదట చెప్పాల్సింది భారతీయ రిజర్వ్ బ్యాంకు.. తర్వాతే ఎవరైనా.. బ్యాంకులు కొంప ముంచుతాయంటే ఏమో అనుకున్నాం కానీ ఇంతగా ముంచుతాయా ఇలా కూడా ముంచుతాయా అనే జనం గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్టాల్లో ఈ బుధవారం ఎటీఎంలలోంచి డబ్బులు ఎవరైనా తీసారంటే వాళ్లు మహాదృష్టవంతులే అని చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడు భారతీయుల ఏకైక లక్ష్యం.. డబ్బు దాచుకోవడం. బ్యాంకుల్లో మాత్రం కాదు. ఉన్నదంతా బ్యాంకుల్లోంచి తీసేసి డబ్బును చాదుకునే చోట్లకోసం వారు వెదుకుతున్నారు. ఇప్పటికే నెటిజన్లు నాలుగురోజులపాటు బ్యాంక్ లావాదేవీలను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాగ్రహం ఎక్కడికి పోతోందో తెలీదు. అవతల మోదీ ఓట్ల పండుగ చేసుకుంటున్నారు ఇవతల జనం ఖర్చైపోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పే డయలాగ్ ఒకటుంది.. మనమెక్కడుంటున్నా.. ఎక్కడికి పోతున్నాం.. ఈ ప్రశ్నకు ఇప్పుడు చంద్రబాబే సమాధానం చెప్పలేరు మరి.