మహారాష్ట్రలో దారుణం జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ కారు డ్రైవర్ చంపినంత పని చేశాడు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు అపరాధం విధిస్తారని భయపడిన కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. అయితే, కారును ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బ్యానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ కారు డ్రైవర్ ఆపకుండా వేగంగా కారును నడుపుకుంటూ ముందుకు అర కిలోమీటర్ మేరకు వెళ్లాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ద్విచక్రవాహనదారులను కూడా ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌లోని సక్కార్దర ప్రాంతంలో రోడ్డుపై కొంతమంది ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి చెక్ చేసి, సరైన పత్రాలు లేకపోతే జరిమానా విధిస్తున్నారు.
దీంతో ఆ కానిస్టేబుల్ కారు ముందే నిలబడి ఉండడంతో బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ, డ్రైవర్ కారును ఆపకుండా దాదాపు అర కిలోమీటరు ముందుకు తీసుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆ కారు డ్రైవర్ ఢీ కొట్టాడు.
చివరకు ఓ కాలేజీ వద్ద ఆ కారును ఆపగా, కానిస్టేబుల్ దానిపై నుంచి దిగాడు. అక్కడ స్థానికులు ఆ కారు నడిపిన వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.