కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కోర్సుల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వేషన్లను కేటాయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22 నుంచే వీటిని అమల్లోకి తీసుకునిరానుంది.
మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ) లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఆల్ ఇండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధులకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 5,550 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, వెనుకబడిన వర్గానికి , ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దీంతో ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్‌లో దాదాపు 1500 మంది ఓబిసి విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది ఓబిసి విద్యార్థులకు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 1000 మంది ఈడబ్ల్యుఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించింది.