సీఎం యోగి బంపర్ ఆఫర్... విద్యార్థులంతా పాస్ పాస్...

బుధవారం, 18 మార్చి 2020 (16:59 IST)
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. అలాంటివాటిలో విద్యా రంగం కూడా ఒకటి. ఈ రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ప్రీకేజీ నుంచి ఉన్నత విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లను మూతపడుతున్నాయి. ముఖ్యంగా, విద్యార్థులు కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వమే విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. 
 
ఈపరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలోని విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ యేడాది ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే, అందరూ ఉత్తీర్ణులయినట్టు ప్రకటించారు. ఈ మేరకు యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన విద్యాశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రేణుకా కుమార్ వెల్లడించారు.
 
వాస్తవానికి యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వుంది. "విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని రేణుకా కుమార్ తెలిపారు.
 
అన్ని పాఠశాలలూ ఏప్రిల్ 2 వరకూ మూసివేయబడి వుంటాయి. తదుపరి పరిస్థితిని బట్టి సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు. మిగతా బోర్డు పరీక్షలు ఎప్పుడు జరపాలన్న విషయమై ఏప్రిల్ 2వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
167 మంది కరోనా అనుమానితుల మిస్సింగ్ 
వివిధ దేశాల నుంచి ఇటీవలే పంజాబ్‌లోని లూథియానాకు వచ్చిన 167 మంది వ్యక్తుల వివరాలు లభించడం లేదని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా వైరస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి చిరునామాలు లభించకపోవడం ఆందోళనకరంగా మారిందని ప్రకటించారు. వారి ఆచూకీ కోసం రెండు బృందాలతో వెతుకుతున్నట్టు తెలిపారు.
 
కొన్ని రోజులుగా లూథియానాకు విదేశాల నుంచి 196 మంది వచ్చినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఉత్తర భారత దేశంలోని పలు ఎయిర్ పోర్టుల్లోని సమాచారం ఆధారంగా వారి పేర్లు, వివరాలు సేకరించారు. వారందరినీ ఇళ్లలోనే క్వారంటైన్ చేయాలని, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను హస్పిటళ్లలోని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని నిర్ణయించారు. కానీ మొత్తం 196 మందిలో కేవలం 29 మంది ఆచూకీ మాత్రమే గుర్తించగలిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు