పబ్లిక్ టాయిలెట్లోకి డ్రగ్స్ తీసుకెళ్ళకూడదన్నాడు.. కత్తితో పొడిచి చంపేశారు..

బుధవారం, 7 జూన్ 2017 (19:43 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలపై నేరాల సంఖ్య అత్యధికంగా జరిగే ప్రాంతంగా నిలిచిన ఢిల్లీలో.. హత్యలు, దోపిడీలు వంటి నేరాలు కూడా అధికమవుతున్నాయి. ఢిల్లీలో నేరాలను అదుపు చేసేందుకు ఢిల్లీ సర్కారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ శరవేగంగా కఠిన చర్యలు తీసుకోవట్లేదు. పబ్లిక్ టాయిలెట్లోకి డ్రగ్స్ తీసుకెళ్లకూడదని వారించిన ఓ యువకుడు దారుణంగా హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఢిల్లీలో గత వారమే ఓ రిక్షా డ్రైవర్‌ను కొందరు కొట్టి చంపిన ఘటన మరువక ముందే ఈ హత్య జరగడం కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. నంగ్లోయి ప్రాంతంలో రెండు పబ్లిక్ టాయిలెట్లకు రాహుల్, అతని తల్లి శ్యామల్ కేర్ టేకర్లుగా ఉన్నారు. మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు ఓ టాయిలెట్ లోకి డ్రగ్స్ తీసుకువెళ్తుండగా శ్యామలత అడ్డుకుంది. అప్పటికి వెళ్ళిపోయిన ఆ దుండగులు.. తర్వాత ఆమెపై దాడికి ఒడిగట్టారు. దీన్ని అడ్డుకున్న రాహుల్‌పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాహుల్.. ఆస్పత్రిలో చేరేలోపు.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి