జయ ప్రియనెచ్చెలి శశికళను ఆ పదవి వరించేనా?.. త్వరలో ఏడీఎంకే సర్వసభ్య సమావేశం

గురువారం, 8 డిశెంబరు 2016 (11:19 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి చెందడంతో ఆమె వారసురాలిని ఎన్నుకునేందు4కు ఆ పార్టీ సర్వసభ్య సమావేశం త్వరలో జరుగనుంది. అనారోగ్యం కారణంగా 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ముఖ్యమంత్రి జయలలిత సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దాంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభాపక్షనేతగా ఒ.పన్నీర్‌సెల్వంను ఎన్నుకోవడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. 
 
అయితే పార్టీ పగ్గాలు చేపట్టే వారిని మాత్రం ఇంకా ఎన్నుకోవాల్సి వుంది. ఇందుకోసం ఇప్పటికే ముగ్గురు నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. జయ సన్నిహితురాలు శశికళ, సీనియర్‌ నేతలైన సెంగోట్టయ్యన్, తంబిదురైలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ పదవికి ఎన్నిక ఇన్నాళ్లూ లాంఛనమే అయినప్పటికీ ఈ సారి మాత్రం ఆ ఎన్నిక అంత సులభంగా కనిపించడం లేదు. 
 
భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ సర్వసభ్య సమావేశం ప్రతి ఆరు నెలలకొకమారు జరగాల్సి వుంది. అయితే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గత జూన్ 18వ తేదీన జరిగింది. ఈ సమావేశం మళ్లీ ఈ నెలలో ఖచ్చితంగా నిర్వహించాల్సి వుంది. అందువల్ల వచ్చే 20వ తేదీ లోపు ఈ సమావేశాన్ని నిర్వహించాలని ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యవర్గంలో ప్రధాన పార్టీ నిర్వాహకులు 38 మంది, ప్రత్యేక ఆహ్వానితులైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 270 మంది ఉన్నారు.
 
అదేవిధంగా జనరల్‌ బాడీలో 3,300 మంది సభ్యులున్నారు. వీరంతా ప్రధాన కార్యదర్శి నియామకాన్ని ఆమోదించాల్సి వుంటుంది. ఈ పదవి తమకే కావాలంటూ ఈ ముగ్గురు నేతలు బహిరంగ ప్రకటన చేయనప్పటికీ లోలోన మాత్రం పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలంతా ఈ సమావేశం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి