ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం మోడీకి అప్పగించిన ఈసీ : చిదంబరం

శుక్రవారం, 20 అక్టోబరు 2017 (14:59 IST)
గుజరాత్ రాష్ట్ర ఎన్నికల తేదీని ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించిందంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరు తీవ్రమైన విమర్శలకు దారితీస్తోందన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించక పోవడం వెనుక కారణమేంటంటూ నిలదీశారు. 
 
"ఈసీ తన సెలవులను పొడిగించుకుంది. గుజరాత్ ప్రభుత్వం అన్ని రకాల తాయిలాలు, రాయితీలు ప్రకటించిన తర్వాతే.. ఈసీకి మళ్లీ గుజరాత్ ఎన్నికలు గుర్తొస్తాయి.." అని చిదంబరం వ్యాఖ్యానించారు. అంతేకాదు గుజరాత్‌ ఎన్నికల తేదీ ప్రకటించే అధికారాన్ని ఈసీ ప్రధాని మోడీకి అప్పగించిందంటూ ఆరోపించారు. 'గుజరాత్‌లో తన చివరి ర్యాలీ సందర్భంగా మోడీ ఎన్నికల తేదీని ప్రకటిస్తారు. ఈ విషయాన్ని ఈసీకి కూడా చెబుతారులే..' అంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
నిజానికి ఈనెల 12వ తేదీనే ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ రోజున కేవలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తేదీలను వెల్లడించిన ఈసీ... గుజరాత్‌పై ఎన్నికల తేదీలపై మౌనం వహించింది. ఈ చర్యపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు