తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషలో మీడియాలో వైరల్ అయింది. తనకు ఆ బస్సుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన చివరి పనిదినమైన తన రిటైర్మెట్ డే రోజున ఆ డ్రైవర్ చేసిన పనికి ప్రతి ఒక్క నెటిజన్ హృదయాన్ని కదిలిస్తుంది. ఈ వీడియోలో డ్రైవర్ భావోద్వేగాన్ని చూసిన నెటిజన్ల కళ్లు కూడా చెమర్చుతున్నాయి. తన చివరి పనిదినం రోజున స్టీరింగ్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్‌లను తాకి ముద్దాడిన డ్రైవర్... బస్సు దిగి దాని ముందు భాగాన్ని హత్తుకుని దండం పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు.
ఆ డ్రైవర్ పేరు ముత్తుపాండి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలో పని చేస్తున్నారు. తన ఆఖరి పనిదినం రోజున చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టారు. స్టీరింగ్‌ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్, చక్రాలు ఇలా అన్ని భాగాలను తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోని కిందికి దిగారు.
పుట్‌బోర్డుకు నమస్కరించి, బస్సు ముందుకు వచ్చారు. సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో బస్సును హగ్ చేసుకున్నారు. నేటితో తమ బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదంతా తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ అయింది.