ఓ కేసులో నిందితుడుగా ఉన్న భర్త ఆచూకీని తెలుసుకునేందుకు పోలీసులు నిండు గర్భిణి అయిన అతని భార్యను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. అంతటితో ఆగని పోలీసులు ఆ గర్భిణి పొట్టపై మహిళా ఎస్.ఐ బూటు కాలితో తన్నింది. దీంతో ఆ మహిళ గర్భవిచ్చిత్తితో విలవిల్లాడిపోయింది. ఈ దారుణం ఒడిషా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల మూడో తేదీన సుందర్‌గఢ్ జిల్లాలోని కణిక గ్రామంలో కారు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేయాలంటూ గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. దీంతో స్పందించిన మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా కేసు పర్యవేక్షణ చేపట్టారు.
ఈ కేసు విచారణలో భాగంగా, నిందితుల్లో బాధితురాలు ప్రియాడే భర్త ఉత్తమ్ డే కూడా ఉన్నాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. భర్త ఆచూకీ చెప్పాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. అక్కడితో ఆగక గర్భిణి అయిన ఆమె పొట్టపై బూటుకాలితో బలంగా తన్నారు. దీంతో ఆమెకు గర్భ విచ్ఛిత్తి జరిగింది.
గర్భిణి అని కూడా చూడకుండా పొట్టపై కాలితో తన్ని తన గర్భ విచ్ఛిత్తికి కారణమైన ఎస్పీ సౌమ్య మిశ్రాపై చర్యలు తీసుకోవాలంటూ ప్రియాడే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఎస్పీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎస్పీపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.