నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై హత్య చేసిన మాజీ సైనికాధికారి..

శుక్రవారం, 28 జూన్ 2019 (14:57 IST)
చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతమైన తిరుముల్లైవాయిల్‌లో నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించి.. హత్య చేసిన ఓ మాజీ సైనిక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై, ఆవడికి సమీపంలోని తిరుముల్లైవాయిల్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య పేరు సెందమిళ్ సెల్వి. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె వున్నారు. 
 
ఈ నేపథ్యంలో సెందమిళ్ సెల్వి రెండో తరగతి చదువుతున్న తన కుమారుడిని ట్యూషన్‌లో వదిలిపెట్టేందుకు తీసుకెళ్లింది. ఆ సమయంలో నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లోనే ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లింది. కుమారుడిని ట్యూషన్‌లో వదిలిపెట్టి ఇంటికొచ్చి చూసేలోపు తన నాలుగేళ్ల కుమార్తె కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రోదించింది. 
 
పలు ప్రాంతాల్లో వెతికినా.. నాలుగేళ్ల కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇంటికి తిరిగొచ్చిన సెందమిళ్ సెల్వికి షాక్ తప్పలేదు. బాత్రూమ్‌లోని బకెట్‌లో ప్లాస్టిక్ సంచిలో నాలుగేళ్ల కుమార్తె శవం కనిపించింది. 
 
ఈ విషయాన్ని సెల్వి మళ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు చిన్నారి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సెందమిళ్ సెల్వి బంధువు, పక్కింటిలో వుంటున్నాడని తెలిసింది. అతడు ఓ మాజీ సైనికాధికారి అని.. అతడి పేరు మీనాక్షి సుందరం అని విచారణలో తేలింది. ఇతడే సెందమిళ్ సెల్వి కుమార్తెను లైంగికంగా వేధించి హత్య చేశాడని తేలింది. దీంతో మీనాక్షి సుందరంను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఇప్పటికే దేశంలో వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న వేళ.. ఓ మాజీ సైనికాధికారి నాలుగేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించడం.. ఆపై హత్య చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. దేశాన్ని కాపాడే సైనికాధికారులు ఇలాంటి దురాగతాలకు పాల్పడటంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు