భుజంపై భార్య శవాన్ని పెట్టుకుని 10 కి.మీ నడిచిన గిరిజనుడు.. ఎందుకని?

గురువారం, 25 ఆగస్టు 2016 (10:15 IST)
తాళి కట్టిన భార్య అనారోగ్యంతో అర్థంతరంగా కన్ను మూయడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు డబ్బుల్లేక, భుజాన వేసుకుని 60 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధమయ్యాడో భర్త. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. 
 
వివరాల్లోకి వెళితే... మేఘారా అనే గ్రామంలో దనమాజీ(42), అమాంగ్ దేయి అనే గిరిజన దంపతులున్నారు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. కాగా అమాంగ్‌కు వ్యాధి ముదరడంతో చికిత్స కోసం భవాని పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 
 
అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆస్పత్రిలో ఏ ఒక్కరూ అతనికి సహకరించలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం.
 
కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి వర్గాలు సహకరించలేదు. దీంతో ఆమె మృతదేహాన్నిబట్టల్లో చుట్టి, తన గ్రామానికి కాలినడకన కూతురితో సహా బయలుదేరాడు. అలా 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగతా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి