పుదుచ్చేరి తమిళనాడులో విలీనం అవుతుందా? 40 ఏళ్ల తర్వాత మళ్లీ..?

బుధవారం, 14 అక్టోబరు 2020 (11:18 IST)
వచ్చే ఏడాది పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికారం కాపాడుకోవాలని కాంగ్రెస్‌, తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ అధికారం చేపట్టాలని బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పుదుచ్చేరిని తమిళనాడులో విలీనం చేయనుందనే వార్తలు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ విషయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి స్వయంగా ఆరోపించడం, వాటిని బీజేపీ కొట్టిపారేయడం జరిగింది. ఫ్రాన్స్‌-ఇండియా ఒప్పందంలో భాగంగా 1954లో పుదుచ్చేరి ప్రాంతాలుగా తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పుదుచ్చేరి, కారైక్కాల్‌, ఆంధ్ర రాష్ట్రంలోని యానాం, కేరళ రాష్ట్రంలోని మాహే భారత్‌లో విలీనమయ్యాయి. 
 
నాలుగు ప్రాంతాలు కలిగిన పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక భద్రత కల్పిస్తామని అప్పటి ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చారు. 1979లో అప్పటి ప్రధాని మోరార్జీదేశాయ్‌ తమిళనాడులో పుదుచ్చేరి విలీనంపై చర్యలు ప్రారంభించారు. దానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ మద్దతు పలికారు. కానీ, ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరిలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో పది రోజుల వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించడంతో పాటు విలీనం చర్యలకు కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
 
40 ఏళ్ల అనంతరం తాజాగా విలీన ప్రతిపాదన హఠాత్తుగా తెరపైకి వచ్చింది. గత నెలలో పుదుచ్చేరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కందస్వామి, పుదుచ్చేరిలో తమిళనాడులో విలీనం చేసేందకు కేంద్రం చర్యలు చేపట్టిందని ఆరోపించారు. వాటిని ఖండించిన ఆ రాష్ట్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి, పుదుచ్చేరిని తమిళనాడులో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదుచేసేలా కేంద్రానికి సిఫారసు చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు బీజేపీ వినతిపత్రం సమర్పించింది. 
 
ఈ విషయమై ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందిస్తూ, రాష్ట్ర హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, రాష్ట్రప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలను కేంద్రం అడ్డుకుంటోందని, చివరకు పేదలకు ఉచితంగా రేషన్‌ బియ్యం కూడా అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు డీఎంకే కూడా మద్దతు ప్రకటించి, పుదుచ్చేరిని తమిళనాడులో విలీనం చేయాలని చూస్తే తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించింది. అదే సమయంలో అన్నాడీఎంకే, బీజేపీలు సీఎం ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు