ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 10 నుంచి 15 సెంటి మీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన గాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు కనీసం అర్థరాత్రివరకూ ఇళ్లనుంచి బయటకు రాకూడదని తమిళనాడు ప్రభుత్వం కోరింది. నగరంలోని విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ భారీ వృక్షాలకు నేలకొరగడంతో.. హోర్డింగ్స్.. కార్లు కొట్టుకురావడంతో అవన్నీ క్లియర్ చేసే పనిలో నగర యంత్రాంగం ఉంది. తమిళనాడులో దాదాపు 7వేలమందిని, ఎపిలో 9,400మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తమిళనాడు, ఎపి ప్రభుత్వాలకు ఫోన్ చేసి ఏ అవసరం చేయడానికైనా కేంద్రం సిద్దంగా ఉందని అభయమిచ్చారు.