తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు వెళ్లారు. వీరిద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వర్దా తుపాను వల్ల ఏర్పడిన నష్టం వివరాలను అందించి, తమకు రూ.22 వేల కోట్ల సాయం చేయాలని కోరారు.
ప్రధాని మోడీతో భేటీ ముగిసిన తర్వాత సీఎస్ రామ్మోహన్ రావు ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. అపుడు పలువురు మీడియా ప్రతినిధులు శశికళ గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. పైపెచ్చు.. ఆమె పేరును సైతం ఉచ్ఛరించలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, శశికళ వర్గం నేత తంబిదురైపై సీఎస్‌పై మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఫైర్ అయ్యారు.
దీంతో మనస్తాపం చెందిన సీఎస్.. ఢిల్లీ నుంచి అర్థాంతరంగా తిరిగివచ్చారు. గత రెండు రోజులుగా ఆయన ముభావంగానే ఉంటూ వచ్చారు. తన పేరును సీఎస్ ఉచ్ఛరించలేదన్న విషయం శశికళకు తెలియడంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అంతే.. తన వర్గీయుడైన మంత్రి పళనిస్వామి అండ్ కో ద్వారా రామ్మోహన్ రావు గుట్టును ఆదాయపన్ను విభాగానికి చేరవేశారు. ఫలితంగా బుధవారం ఐటీ అధికారులు సీఎస్‌తో పాటు.. ఆయన బంధువుల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు చేశారు.
మరోవైపు.. రామ్మోహన్ రావుతో పాటు ఆయన బంధువులు, వ్యక్తిగత కార్యదర్శుల ఇళ్ళలో సాగిన సోదాలు.. బుధవారం రాత్రితో ముగిశాయి. ఈ సోదాల్లో 40 కీలక పత్రాలతో పాటు.. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 25 లక్షల కొత్త కరెన్సీ 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.