నెహ్రూ - గాంధీ కుటుంబం ఈ దేశాన్ని రక్షించాలి : శివసేన
శనివారం, 8 మే 2021 (16:37 IST)
భారత్ దుస్థితిని చూసి చిన్న దేశాలు సహాయం చేస్తున్నాయనీ, కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రల్ విస్తా ప్రాజెక్టును చేపట్టిందని శివసేన వ్యాఖ్యానించారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో భారత్ తిరిగి మనుగడ సాగించాలంటే ఒక్క నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే సాధ్యపడుతుందన్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ పత్రిక సంపాదకీయంలో ఓ వార్తను రాసింది.
'కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుండి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్‌కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్‌డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ఆత్మనిర్భర్ భారతదేశానికి సహాయం అందించాయి.
స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్‌కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్, రువాండా, కాంగో వంటి దేశాలు ఇతరుల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది” అని శివసేన విమర్శించింది.
దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్‌కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో రూ.20,000 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది.
ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది.
అలాగే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది.
'పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది' అని సామ్నా పత్రికలో పేర్కొంది.