ఒక రాకెట్‌.. 103 ఉపగ్రహాలు... అద్భుతాన్ని ఆవిష్కరించనున్న ఇస్రో

బుధవారం, 18 జనవరి 2017 (05:38 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇందులోభాగంగా, పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఈ అద్భుత కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటివారంలో చేపట్టనుంది. దీనికి సంబంధించి మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) కమిటీ ఛైర్మన్‌ బీఎన్‌ సురేశ్‌ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. 
 
ఇస్రో రోదసీలోకి పంపనున్న 103 ఉపగ్రహాల్లో దేశీయంగా కార్టోశాట్‌-2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందుకోసం షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్‌ అనుసంధాన పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనులు పూర్తి చేసి కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. 
 
కాగా, ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అత్యధికంగా 103 ఉపగ్రహాలను ఒకే రాకెట్‌ ద్వారా పంపబోయే మొట్టమొదటి దేశంగా భారతదేశం ముందువరుసలో నిలువనుంది. ఇప్పటికే 2008లో ఒకేసారి పది ఉపగ్రహాలు, 2016లో 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్రను తిరగరాసింది. అయితే ఇప్పటిదాకా అత్యధిక ఉపగ్రహాలను పంపిన దేశాలుగా రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. 
 
2013లో అమెరికా 29 ఉపగ్రహాలు, 2014లో రష్యా 37 ఉపగ్రహాలు పంపించి మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా ఇస్రో 20 ఉపగ్రహాలను పంపించిన మూడో దేశంగా నిలిచింది. ఫిబ్రవరి మొదటివారంలో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా 103 ఉపగ్రహాలు ప్రయోగం అనంతరం ఒకే దఫాలో అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొట్టమొదటి దేశంగా భారత్‌ ఆవిర్భవించనుంది. 

వెబ్దునియా పై చదవండి