జయలలితకు బీపీ.. శశికళకు కడుపునొప్పి.. సుధాకరన్‌కు అస్వస్థత.. ఇళవరసికి..?

మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (16:40 IST)
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడి బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బీపీ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే, ఆమె ప్రియనెచ్చెలి శశికళ వరుసగా తీవ్రమైన కడుపునొప్పితో అవస్థలు పడుతున్నారు. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌కు జైలు భోజనం పడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శశికళ బంధువు ఇళవరసి కూడా అనారోగ్యంగా ఉన్నట్టు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
జయలలితకు బీపీ, వెన్నునొప్పి పెరగడంతో ప్రతి రెండు గంటలకోసారి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ విజయకుమార్, కుటుంబ వైద్యుడు శాంతారాంలు ఈ పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత జైల్లోని ఆసుపత్రి వైద్యులతో కూడా వీరు చర్చించారు. ఇకపోతే.. ఈకేసులో ఏ2గా ఉన్న శశికళకు రెండో రోజు కూడా కడుపునొప్పి రావడంతో ఆమెకు ప్రత్యేకంగా వైద్యపరీక్షలు చేశారు. సుధాకరన్‌ తీవ్రంగా అస్వస్థతకు గురికావడంతో సోమవారం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేశారు. 
 
మరోవైపు.. తొలి రోజున జైలు ఆహారంగా ఇచ్చిన రాగిసంగటి, పెరుగన్నంను స్వీకరించిన జయలలిత.. ఇపుడు పూర్తిగా జైలు భోజనం ముట్టడం లేదు. బీపీ పెరగడంతో ఆమె కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఉదయం పూట మాత్రం తన కార్యదర్శితో ఇడ్లీ, సాంబారు తెప్పించుకుని అల్పాహారం చేస్తూ, మధ్యాహ్నం పండ్లు, పాలతోనే సరిపెట్టుకుంటున్నారు. కాగా, జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బయటి ఆహారానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి