తమిళనాడును వెంటాడుతున్న డిసెంబర్... ఈనెలలో విషాద ఘటనలెన్నో... అమ్మ డెత్ సర్టిఫికేట్ ఇదే..

మంగళవారం, 6 డిశెంబరు 2016 (12:43 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని డిసెంబర్ నెల వెంటాడుతోంది. ఈ నెలలోనే అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత చరిత్రను పరికిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి జయలలిత మరణంతో అది మరోమారు నిరూపితమైంది. 
 
ఈ సెంటిమెంట్‌కు కారణం లేకపోలేదు. తమిళనాడు ప్రజలను శోకసంద్రంలోకి నెట్టిన నెల డిసెంబర్. 1987 డిసెంబర్ 24న తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్ చనిపోయారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సునామీ వచ్చింది. కొన్ని వేల మందిని కబళించింది. 
 
గత యేడాది నవంబర్ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో చెన్నై వరదలతో కుదేలైంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పులిహోర ప్యాకెట్ల కోసం ప్రజలు దీనంగా ఎదురుచూసిన దుస్థితి నెలకొంది. పేద, మధ్య, ధనికుడు అనే తేడా లేకుండా చేశాయి.. ఈ వరదలు. ఈ ఉపద్రవం నుంచి తట్టుకుని తమిళనాడు కోలుకుంది.
 
సరిగ్గా సంవత్సర కాలానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారు. తమిళ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. 74 రోజుల పాటు జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందారు. జయ ఆరోగ్యం గురించి శుభవార్త వస్తోందని ఆశించిన తమిళ ప్రజలకు నిరాశే ఎదురైంది. డిసెంబర్ 5 రాత్రి 11.30 జయ కన్నుమూశారంటూ అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో డిసెంబర్ నెల పేరు వింటేనే తమిళ ప్రజలు భయపడిపోతున్నారు. వచ్చే డిసెంబర్‌లో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదిలావుండగా, తమిళనాడు ప్రజలకు అన్నీ తానై ‘అమ్మ’గా పేరుగాంచిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం మృతి చెందినట్లు చెన్నై అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ జయలలిత డెత్ సర్టిఫికెట్‌ను మంగళవారం ఉదయం 11 గంటలకు జారీ చేసింది. 2016 డిసెంబర్ 5న రాత్రి 11.30కి 68 ఏళ్ల జయలలిత మృతి చెందినట్లు అందులో పేర్కొన్నారు. జయలలిత అమ్మగారు జె. సంధ్య, నాన్నగారు ఆర్. జయరామ్ అని డెత్ సర్టిఫికెట్‌లో ఉంది. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో నంబర్ 18 ఇంట్లో జయలలిత నివాసమున్నట్లు అందులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి