శశికళ అంతిమ సంస్కారం చేయడమేమిటి? జయ వారసురాలిని నేనే.. సీన్లోకి జయలలిత మేనకోడలు!

గురువారం, 8 డిశెంబరు 2016 (11:28 IST)
దివంగత సీఎం జయలలిత కుటుంబీకులు ఆమె అంత్యక్రియల్లో అంతగా ఎక్కడా కనిపించలేదు. అయితే జయలలిత దివంగత సోదరుడు జయకుమార్‌ కుమార్తె దీపా జయకుమార్ సీన్లోకి వచ్చారు. జయలలిత సమాధిని దర్శించుకునేందుకు ఆమె వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత మృతికి సంబంధించి బయటకు తెలియని అనేక అంశాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని తెలిపారు. 
 
వేద నిలయంలోకి వెళ్లనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మా అత్తకు శశికళ అంతిమ సంస్కారం నిర్వహించడమేంటని, ఆ దృశ్యాలు తమ కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించాయని చెప్పారు. అంతేగాకుండా, జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని ఆమె ప్రకటించారు. చెన్నై టీనగర్లో నివశిస్తున్న దీపా జయకుమార్‌ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. 
 
కాగా జయలలితకు నివాళులు అర్పించేందుకు వచ్చిన దీపా జయకుమార్‌ను ప్రజలు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. అచ్చం జయలలితలాగానే ఉన్న ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కానీ పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి పంపించారు.
 
ఇదిలా ఉంటే.. దివంగత సీఎం జయలలితకు సంబంధించి హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థి తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చరణ్య కణ్ణన్ అనే విద్యార్థి చేసిన ఈ పోస్ట్‌లో జయలలిత‌కు సంబంధించిన అరుదైన విషయాలను ఉటంకించింది. 
 
ఆ విషయాల్లో ఒకటేమిటంటే.. సినిమా సెట్‌కు ఎంజీఆర్ వస్తుంటే గౌరవ సూచకంగా అందరూ లేచి నిలబడే వారట. కానీ, పదహారేళ్ల జయలలిత మాత్రం తన చేతిలోని పుస్తకం చదువుకుంటూ అలాగే కూర్చునేదట. జయలలిత ధైర్యం చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ షాక్ అయ్యేవారట. నాడు జయలలిత చూపిన ధైర్యమే ఆమెను రాజకీయాల వైపు అడుగులు వేయించిందని చరణ్య కణ్ణన్ ఆ పోస్ట్‌లో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి