ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీప భార్యాభర్తల మధ్య చిచ్చురేగింది. ఎంజీఆర్ జయలలిత దీప పేరవై నుంచి వైదొలుగుతున్నట్టు దీప భర్త మాధవన్ ప్రకటించారు. రెండు మాసాలుగా త్వరలో రాజకీయ ప్రవేశం, కొత్త పార్టీ ఏర్పాటు అంటూ పదేపదే ప్రకటించి మద్దతుదారుల సమీకరణతో సంచలనం సృష్టించిన దీప.. రాజకీయ పార్టీకి బదులు రాజకీయ వేదికను మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు ఇదే వారి పచ్చటి కాపురంలో చిచ్చుపెట్టింది.
దీంతో దీప తన పేరవైకి తానే కార్యదర్శిగా వ్యవహరిస్తానని, త్వరలో పేరవై కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తానని వారిని సర్దిపుచ్చారు. ఆ మేరకు గత కొంతమందితో నిర్వాహకుల పేర్లను ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి వలసరవాక్కంలో అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యులు, ఎంపీలతో దీప రహస్యంగా సమావేశమాయ్యరు. ఆ తర్వాత దీప పేరుతో వాట్సప్‌లో ఓ ప్రకటన జారీ అయింది.
ఆ ప్రకటనలో దీపా సంతకం లేకపోవడంతో ఆమె మద్దతుదారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పేరవై నిర్వాహకుల ఎంపిక వ్యవహారంలో దీపాకు, ఆమె భర్త మాధవన్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలిసింది. ఆ కారణంగానే దీప ప్రస్తుతం ఆయన తోడు లేకుండా నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్నాడీఎంకే మాజీ నాయకులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారు.
ప్రస్తుతం దీప భర్త మాధవన్తోడు లేకుండానే తన కారు డ్రైవర్ ఏవీ రాజాను వెంటబెట్టుకుని వెళుతున్నారు. రాజా ప్రస్తుతం కారు నడపకుండా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే మాధవన్ మీడియాతో మాట్లాడుతూ దీపపై తన అసంతృప్తిని పరోక్షంగా వెల్లడించారు. గత మూడు మాసాలుగా తాను దీపతో కలిసి కార్యకర్తలను, అన్నాడీఎంకే మాజీ నాయకులను కలుసుకుని కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతూ వచ్చామని, తామిరువురం కలిసే నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.