సీటు వ్యవహారం.. స్టాలిన్‌కు ''అమ్మ'' థ్యాంక్స్.. వస్తారని తెలిస్తే ముందు వరుసలోనే?!

మంగళవారం, 24 మే 2016 (18:30 IST)
చెన్నైలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారోత్సవంలో డీఎంకే నేత స్టాలిన్‌ను అగౌరవపరిచారని డీఎంకే చీఫ్ కరుణానిధి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో.. తమిళనాడు సీఎం జయలలిత మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని, ఈ విషయంలో స్టాలిన్‌ను అగౌరవపరచాలనే ఉద్దేశం లేదన్నారు. 
 
ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆయన వస్తున్నట్లు తెలిస్తే.. ప్రోటోకాల్ పక్కన పెట్టి ముందు వరుసలో సీటు కేటాయించే వాళ్లమని జయలలిత విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్టాలిన్‌ను, డీఎంకే పార్టీని కావాలని అవమానించలేదని.. వారిని అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. 
 
ప్రతిపక్ష నేత, డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌కు జయలలిత ప్రమాణస్వీకారోత్సవంలో ముందు వరుసలో సీటు కేటాయించకపోవడంపై డీఎంకే చీఫ్ కరుణానిధితో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. జయలలిత వైఖరి ఎప్పటికీ మారదని కరుణ ధ్వజమెత్తారు. 

వెబ్దునియా పై చదవండి