నిజానికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఈ యేడాదంతా ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. ప్రజల జీవితాల్లోని సరదాలు, సంతోషాలను కరోనా వైరస్ అమాంతం లాగేసుకుంది. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం 2020 చివరి అంకంలో ఉన్నాం. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన అకాశంలో ఓ అద్భుతం కనిపించనుంది.
ఈ నెల 21న గురు, శనిగ్రహాలు అత్యంత సమీపానికి రానున్నాయి.. రెండూ కలిసి ఓ పెద్ద నక్షత్రంలా దర్శనమివ్వనున్నాయి. దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 1623న ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయి. ఇదో గొప్ప సంయోగమని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేబీ ప్రసాద్ డుయారీ పేర్కొన్నారు.
'రెండు ఖగోళ వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి దానిని భూమి నుంచి చూడగలిగితే దానిని సంయోగమని అంటారు. అదే శని, గురు గ్రహాలు ఇలా దగ్గరికి వస్తే దానిని 'గొప్ప సంయోగమని' అంటారు' అని దేబీ ప్రసాద్ వివరించారు. ఇప్పుడు కనుక ఈ గొప్ప సంయోగాన్ని చూడడం మిస్సయితే మళ్లీ 15 మార్చి 2080 నాటికి గానీ చూడలేమని ఆయన పేర్కొన్నారు.