సూపర్ స్టార్ కోరితే.. సీఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం.. కమల్ హాసన్

మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:53 IST)
Kamal_Rajini
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖులు సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ లెజెండ్ కమల్ హాసన్‌ల హవా కొనసాగనుంది. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్‌ నీది మయ్యంను స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో.. రజనీకాంత్‌ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని కమల్‌హాసన్‌ అన్నారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం జిల్లాల్లో పర్యటించారు. రజనీకాంత్ కోరితే సీఎం అభ్యర్థిగా తాను నిలిచేందుకు సిద్ధమని ప్రకటించారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం రూ.2,500 ఇస్తోందని.. తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు.
 
అయితే తూత్తుకుడి ఆందోళనల ఘటనపై నటుడు రజనీకాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్‌ జడ్జి కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో కాల్పులు జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్ట్‌ జస్టిస్‌ అరుణ జగదీశన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్‌ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మక్కల్‌ సేవై కట్చి పేరును రజనీకాంత్‌ రిజిస్టర్‌ చేస్తే కోర్టులో కేసు దాఖలు చేస్తామని అఖిల భారత మక్కల్‌ సేవై ఇయక్కం అధ్యక్షుడు తంగ షణ్ముగసుందరం హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు