గ్రహాంతరవాసి కాదు.. కోతికి మేకప్ వేసి...

మంగళవారం, 5 జూన్ 2018 (10:27 IST)
కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో గ్రహాంతరవాసి సంచరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలా ఏదో ఒక గ్రూప్ ఈ ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. భూమిపై గ్రహాంతరవాసులు దిగాయని.. పశువులపై దాడి చేశాయంటూ ఒకటే గోల. ఎంతగా ఇది జనంలోకి వెళ్లింది అంటే.. ఇంట్లోని గృహిణుల స్మార్ట్ ఫోన్లలోకి కూడా చొరబడింది. ఏకంగా కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయటంతో మరింత కలకలం రేపింది. ఇదంతా తప్పుడు వార్త అని ఖండిస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో షేరింగ్ మాత్రం ఆగలేదు.
 
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... కొంత మంది యువకులు.. కోతిని పట్టుకొచ్చారు. దానికి మేకప్ వేశారు. ముఖానికి గ్రహాంతరవాసి ఆకారం తీసుకురావటానికి ఎంతగానో శ్రమించారు. మిగతా శరీరం కనిపించకుండా నల్లటి వస్త్రాన్ని కప్పేశారు. ముఖం హావభావాలు కనిపించకుండా పూర్తిగా తెల్ల రంగు పూసేశారు. చుట్టూ మనుషులు ఉండటంతో ఆ కోతి ఎటూ వెళ్లలేక ఇబ్బంది పడుతుంది. దీనికితోడు ఓ యువకుడు కర్రను కోతి దగ్గరగా తీసుకెళ్లటం.. అది పట్టుకోవటానికి ప్రయత్నించటం స్పష్టంగా కనిపిస్తోంది. కోతినే.. గ్రహాంతరవాసిగా నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత దాన్ని పట్టుకుని కట్టేశారు. ఇక్కడ కూడా స్పష్టంగా తెలుస్తోంది.. ఈ కోతి కింద కాళ్లతో పరిగెత్తటానికి ప్రయత్నిస్తున్నట్లు. అసలు ఇది కర్ణాటకలో జరిగిందో.. మరెక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇది మాత్రం కోతి అని గట్టిగా చెబుతున్నారు. కొంత మంది కావాలనే వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని.. గ్రహాంతరవాసి కాదని నెటిజన్లు తేల్చిపారేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు