మాలాంటివారిని వాడుకోవడం లేదు .. అందుకే వీడుతున్నా.. సోనియాకు ఖుష్బూ లేఖ

సోమవారం, 12 అక్టోబరు 2020 (13:04 IST)
తమిళ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేశారు. ఆమె పార్టీని వీడుతూ, తన మనసులోని మాటలను లేఖ రూపంలో బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. ఇందులో తాను పార్టీని ఎందుకు వీడుతున్నారో వివరించారు. తనలాంటి వారిని కొందరు నేతలు అణిచివేస్తున్నారనీ, వాస్తవ పరిస్థితికి పార్టీలోని పరిస్థితికి భిన్నంగా ఉందని వాపోయారు. 
 
ముఖ్యంగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. అంతేగానీ, పేరు, ప్రతిష్టల కోసం కాదని గుర్తుచేశారు. 
 
అయితే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు తనను అణచివేశాయని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఖుష్బూ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆమె సోమవారం హస్తినకు చేరుకుని, బీజేపీ పెద్దలను కలుసుకున్న తర్వాత ఆమె కమలదళం సభ్యత్వం స్వీకరించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు