18 నుంచి లాక్డౌన్ 4.O : రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు... న్యూ రూల్స్ ఇవే... (video)
ఆదివారం, 17 మే 2020 (20:40 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ అమల్లో వుంది. ఇప్పటివరకు మూడు దశల్లో లాక్డౌన్ అమలు చేయగా, అది ఆదివారంతో ముగిసింది. దీంతో సోమవారం నాలుగో విడతగా లాక్డౌన్ అమలు కానుంది. ఇది మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు కొత్త ఆదివారం రాత్రి ప్రకటన చేసింది. అయితే, ఈ నాలుగో దశలో పలు సడలింపులు ఇచ్చింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి సమన్వయంతో వాహనాల రాకపోకలకు అనుమతించవచ్చు.
* రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.
* సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశాలపై యధావిధిగా నిషేధం కొనసాగుతుంది.
* కరోనా వైరస్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
* సరుకు రవాణాకు మాత్రం అన్ని రాష్ట్రాలు విధిగా అనుమతించాల్సిందే.
* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుంపులుగా చేరడంపై నిషేధం.
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
* క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.
* మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.
* అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే.
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు.
* ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతాపరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.
* అన్ని రాష్ట్రాల్లో మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
* పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
* కానీ, ఆన్‌లైన్ విద్యాబోధన, దూర విద్యా బోధన మాత్రం కొనసాగుతుంది.
* హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది.
* కానీ, హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరిచివుంచొచ్చు.
* బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి.
* ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.
* అయితే, ఈ దఫా జోన్ల ఏర్పాటు, ప్రకటనలపై పూర్తి నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కట్టబెట్టింది.
* ఆయా రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు చేసుకోవడమే కాదు, వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు.
* ముఖ్యంగా, 65 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భవతులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటివద్దే ఉండాలని సూచించారు.
* ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా డౌన్‌లోడ్ చేసుకునివుండాల్సిందేనని స్పష్టం చేసింది.
* సాధారణ వ్యక్తుల్లోనూ ఆరోగ్య సేతు యాప్ వినియోగం పట్ల చైతన్యం కలిగించాలని తెలిపారు.
* అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య, ఆరోగ్య నిపుణులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ల కదలికలపై ఆంక్షలు విధించరాదని కేంద్రం స్పష్టం చేసింది. వారు ఇతర రాష్ట్రాల్లో సేవలు అందించాల్సిన అవసరం వస్తే అనుమతించాలని సూచించింది.