రైతుల హెచ్చరికలతో మహా సర్కారుకు ముచ్చెమటలు.. రుణమాఫీకి ఓకే

సోమవారం, 12 జూన్ 2017 (11:10 IST)
రుణాలమాఫీ కోరుతూ సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయించాయి. దీంతో రైతు రుణమాఫీని ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాలు జారీ చేశారు. చిన్న, మధ్యతరహా రైతులకు దీనివల్ల వెంటనే ప్రయోజనం చేకూరనుంది. 
 
వాస్తవానికి దేశవ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతుల వ్యయసాయ రుణమాఫీపై దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నాయి. అటు తమిళనాడు మొదలుకొని ఉత్తరాదివరకూ అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రుణ మాఫీ కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో రుణాల మాఫీ పేరుతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఇప్పడు పునరాలోచనలో పడ్డాయి. రుణమాఫీని అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణ మాఫీని ప్రకటించింది. చిన్న, మధ్యతరహా రైతులకు దీనివలన వెంటనే ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. సోమవారం నుండి రుణ మాఫీ అమలు కోసం నిరసనకు దిగుతామని ప్రకటించించిన రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. రైతు రుణమాఫీతో మహారాష్ట్ర ప్రభుత్వంపై రూ.30 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది. మొత్తానికి రైతులు విజయం సాధించారు.

వెబ్దునియా పై చదవండి