ఢిల్లీలో 1500 మంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు, వీడియో, ఫోటోలు పంపిన వ్యక్తి అరెస్ట్..!

గురువారం, 7 జులై 2016 (11:50 IST)
దేశరాజధాని ఢిల్లీలో 1500 మంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు, వీడియో సందేశాలు, ఫొటోలు పంపి వారిని చిత్రహింసలకు గురిచేసిన ఓ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో మూడు మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసి వాటితో మహిళలను వేధిస్తున్నమహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈశాన్య ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ వెల్లడించారు.
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... మహమ్మద్‌ ఖలీద్‌ దిల్లీ ఓల్డ్‌ క్వార్టర్స్‌లో బ్యాగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నాడు. అతడు నకిలీ పత్రాల ద్వారా సిమ్ కార్డులు కొనుగోలు చేసి వివిధ మొబైల్‌ ఫోన్లతో అమ్మాయిలకు అసభ్యంగా మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఢిల్లీలోని వివిధ హెల్ప్‌లైన్‌ నంబర్లకు పలువురు మహిళల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఖలీద్ గత కొద్దికాలంగా తనకు ఇష్టం వచ్చిన నంబర్లకు ఫోన్‌ చేసేవాడు. ఒకవేళ ఆ మొబైల్ నంబర్లలో మహిళలు మాట్లాడినట్లయితే ఆయా నంబర్లను తన మొబైల్‌లో ఫీడ్ చేసుకొని వారికి వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు, అసభ్య జోకులు పంపేవాడు. ఖాలీద్ వద్ద దాదాపు 2 వేలకు పైగా మహిళల ఫోన్ నంబర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కొద్దికాలంగా తనను వేధిస్తున్నాడని, ఆ వ్యక్తిని తాను బెదిరించడంతో చంపుతానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఖాలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి