మణిపూర్ గవర్నర్ రాజీనామా : తొమ్మిదో వికెట్ పడింది!

గురువారం, 28 ఆగస్టు 2014 (16:12 IST)
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇందులోభాగంగా గురువారం మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. దీంతో యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు రాజీనామా చేసిన వారిలో వీకే దుగ్గల్ తొమ్మిదో వ్యక్తి కావడం గమనార్హం. 
 
యూపీఏ గవర్నర్లు రాజీనామా చేయాలన్న సంకేతాలు వెలువడగానే ముందుగా బీఎల్ జోషి, శేఖర్ దత్, అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత బీవీ వాంఛూ, ఎంకే నారాయణన్ అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించడంతో కలత చెంది పదవుల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత తనను నాగాలాండ్కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బి.పురుషోత్తమన్ తప్పుకొన్నారు. ఇలా వరుసపెట్టి రాజీనామాల పర్వం కొనసాగింది. చిట్టచివరగా రెండు రోజుల క్రితం కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు దుగ్గల్ వంతు వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి