రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నల్లధనాన్ని మార్పు చేసుకునేందుకు కుబేరులు అష్టకష్టాలుపడుతున్నారు. నల్లధనాన్ని కాపాడుకునేందుకు తమకు తెలిసిన వారి ఖాతాల్లో నల్ల కుబేరులు తమ ధనాన్ని కన్నుమూసేసుకుని జమ చేసేస్తున్నారు. అంతేగాకుండా కమిషన్ల పేరిట.. బ్యాంకుల్లో డబ్బు జమ చేస్తామని.. ఆపై రెండు నెలల తర్వాత తీసేసుకుంటామని నల్ల కుబేరులు డీల్ కుదుర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన యూపీలో చోటుచేసుకుంది.
తాపీమేస్త్రీగా పనిచేసే బ్యాంకు ఖాతాలో రాత్రికి రాత్రే రూ.62లక్షల నగదు జమైంది. దీంతో తాపీమేస్త్రి సంతోషపడాలో ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. పెద్ద నోట్లను ఈ నెల 8వతేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దుతో చిల్లర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలా అజయ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి ముంబైలో ఉంటూ, తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అసలే కష్టాల్లో ఉన్న అతని బ్యాంకు ఖాతాలో రూ.6728 డబ్బు దాచుకున్నాడు. కానీ పెద్ద నోట్ల రద్దుతో రాత్రికి రాత్రే రూ.62 లక్షలు అజయ్ కుమార్ బ్యాంకులో డిపాజిట్ అయ్యిందని ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్‌ను అజయ్ చూసుకోలేదు. కంపెనీ యాడ్లంటూ తేలిగ్గా తీసిపారేశాడు.
ఇకపోతే.. అజయ్ కుమార్ పటేల్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ ఘర్ జిల్లా. అజయ్ కుమార్‌కు బ్యాంకు ఖాతా ఉత్తర్ ప్రదేశ్‌లోనే ఉంది. ఇటీవలే ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడు. తన నగదును డ్రా చేసుకోవడానికి ఎటిఎం వద్దకు వెళ్ళగానే ఆయన అకౌంట్‌ను సీజ్ చేసినట్టు సమాచారం తెలిపింది ఏటీఎం. దీంతో ఆయన వెంటనే తన ఫోన్‌కు వచ్చిన మేసేజ్‌ను చూసుకొని అవాక్కయ్యాడు. తనకు డిపాజిట్ అయిన డబ్బు వద్దని, తన డిపాజిట్‌లో ఉన్న ధనాన్ని డ్రా చేసుకునే వీలు కల్పించాలని బ్యాంకు ఉద్యోగులను ఆయన కోరుతున్నాడు.