తమిళనాడులో నిజంగానే గ్రహాంతర శిల పడిందా.. ఆ డ్రైవర్ మృతికి ఆ ఉల్కే కారణమా?

సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (16:22 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో నిజంగానే గ్రహాంతర శిల పడిందా? నెల్లూరు జిల్లాకు చెందిన డ్రైవర్ ఒకరి మరణానికి ఈ గ్రహాంతర శిలే కారణమా? దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అవుననే అంటున్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో ఉల్క నేలపై పడటంతో డ్రైవర్ కామరాజ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంటూ ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ మాత్రం గ్రహాంతర శిల భూమిపై పడిందన్న వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ గ్రహాంతర శిల పడటంతో మరణం సంభవించడమనేది నమ్మశక్యంగా లేదన్నారు. అటువంటివాటిని పడుతుండగా చూడటం అరుదుగా ఆయన పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి, అవశేషాలను పరీక్షించేందుకు శాస్త్రవేత్తలతో కూడిన నిజ నిర్ధారణ బృందం ప్రయత్నిస్తోందని చెప్పారు.
 
కాగా, వేలూరు జిల్లాలోని కె.పంథరపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో శనివారం ఓ ఉల్క పడిన విషయంతెల్సిందే. దీని కారణంగా సంభవించిన పేలుడు ధాటికి కామరాజ్ అనే డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి బస్సుల అద్దాలు, సమీపంలోని భవనాల కిటీకీల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద గొయ్యి కూడా పడింది. దీంతో పోలీసులు మొదట్లో అక్కడ గ్రెనేడ్ లేదా బాంబు పేలి ఉండవచ్చునని అనుమానించారు. కానీ, ముఖ్యమంత్రి జయలలిత ప్రకటనతో అది పేలుడు కాదని, ఉల్క పడటంతో ఏర్పడిన గొయ్యేనని పోలీసులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి