ముంబై ఐఐటీ విద్యార్థులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్న వానరాలు

గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:25 IST)
ముంబై ఐఐటీ క్యాంపస్‌ విద్యార్థులంతా భయాందోళనల్లో వణికిపోతున్నారు. వారి హాస్టళ్లపై గత కొద్దిరోజులుగా పదిహేను వానరాలు ప్రవేశించి నానా విధ్వంసం సృష్టించి విద్యార్థుల్ని భయపెడుతున్నాయి. వాటి అరుపులు కేకలతో క్యాంపస్‌లోని ఉండే విద్యార్థులు కనీసం నిద్రపోలేకపోతున్నారు. విద్యార్థుల ఆహార పదార్థాలు, దుస్తులే కాకుండా, విలువైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా లాక్కుపోతున్నాయి. 
 
రోజు రోజుకీ కోతుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది. వాటి ఆగడాలను భరించలేకపోతున్నామని విద్యార్థులు తమ సమస్యను ఆన్‌లైన్‌ క్యాంపస్‌ మ్యాగజైన్‌ 'ఇన్‌సైట్' ద్వారా బయటపెట్టారు. కాగా, ముంబై ఐఐటీ క్యాంపస్ ప్రాంగణం చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నందున కోతుల సమస్య అధికంగా ఉందని, వస్తువులన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఏ వస్తువునూ బయటపెట్టకుండా హాస్టల్ గదుల్లో ఉంచుకోవాలని కళాశాల డీన్ సౌమ్యా ముఖర్జీ వెల్లడించారు. అంతేకాకుండా కోతులను తరిమి కొట్టేందుకు టపాకాయలు పేల్చమని విద్యార్థులకు సూచించారు. వానరాలను తరిమికొట్టేందుకు నిపుణుల సహాయంతో చర్యలు చేపడతామని సౌమ్య తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి