కరోనా అదుపులో గాడితప్పిన ప్రభుత్వం.. శవాలపై రాజకీయాలొద్దు...

గురువారం, 13 మే 2021 (07:53 IST)
దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో శవాలపై రాజకీయాలు చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. 
 
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ఆయన సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనీయని వారిలో నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఒకరు. ఈయన ఇపుడు అనూహ్యంగా మోడీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఎక్కడో గాడి తప్పిందన్నారు. మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ఆయన సమర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలు అప్పగించిన బాధ్యతను చక్కబెట్టాలని హితవు పలికారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
 
అదేసమయంలో కాంగ్రెస్‌ పార్టీకి కూడా అనుపమ్‌ ఖేర్‌ పరోక్షంగా చురకలంటించారు. శవాలు నీటిలో తేలడం చూసి మానవత్వం లేని వారు మాత్రమే చలించరని వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీహార్‌లో గంగా నదిలో కొట్టుకొచ్చిన శవాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి అంశాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు