ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. అందుకు ఈ నెల 22వ తేదీన ముహూర్తంగా ఖరారు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి పదోన్నతి లభించే అవకాశం ఉండగా, స్మృతి ఇరానీకి స్థానచలనం కల్పించనున్నారు.
ప్రస్తుతం వ్యవసాయ శాఖామంత్రిగా ఉన్న గిరిరాజ్ సింగ్‌కు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శాఖను వెంకయ్య నాయుడుకి అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే, స్మృతి ఇరానీకి సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉండగా, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రిగా ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడైన డాక్టర్ సుబ్రమణియన్ స్వామికి కేటాయించనున్నట్టు సమాచారం.
అదేసమయంలో 2017లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లకు విస్తరణలో పెద్ద పీట వేయాలని ప్రధాని భావిస్తూనే.. బీహార్ రాష్ట్రానికి మంత్రి కేంద్ర మంత్రులందరినీ తొలగించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అస్సాం ముఖ్యమంత్రిగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి సోనోవాల్ బాధ్యతలు చేపట్టడంతో విస్తరణ అనివార్యమైన విషయం తెల్సిందే. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
కాగా, సోనోవాల్ స్థానంలో రామేశ్వర్ తెలి లేదా రీమన్ దేఖాలలో ఒకరికి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉంది. వీరిలో రామేశ్వర్ తేలి పార్టీ ఎంపీ కాగా, రామన్ దేఖా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అలాగే, అలహాబాద్ ఎంపీ శ్యామ్ శరణ్ గుప్తా, జబల్‌పూర్ ఎంపీ రాకేష్ సింగ్, బైకనర్ ఎంపీ అర్జున్ రాం మేఘ్వాల్, బీజేపీ ప్రధానకార్యదర్శి ఓం మాథూర్, వినయ్ సహస్రబుద్దీలకు మంత్రివర్గంలో కొత్తగా అవకాశం కల్పించనున్నారు. మరోవైపు నిహాల్ చంద్, గిరిరాజ్ సింగ్, నజ్మా హెప్తుల్లాలతో పనితీరు సరిగా లేదని మంత్రులపై వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు అసంతృప్త నేతలకు పార్టీ పదవులిచ్చి బుజ్జగించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు.