మీ బాధ మా బాధ.. ఆదుకుంటాం... నేపాల్‌‌కు నరేంద్ర మోడీ హామీ!

ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (09:24 IST)
నేలమట్టమైన నేపాల్‍‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్‌కు హామీ ఇచ్చారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్‌ అండగా నిలిచేందుకు ముందున్నట్టు ఆయన ప్రకటించారు. 
 
ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా, అధ్యక్షుడు రామ్‌ బరణ్‌ యాదవ్‌లకు మోడీ ఫోను చేసి హామీ ఇచ్చారు. 
 
మరోవైపు... నేలమట్టమైన నేపాల్‌లో ఆదివారం ఉదయం మరణించిన వారి సంఖ్య 1805 దాటింది. రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైన భారీ భూకంపం నేపాల్‌ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. 
 
భూకంపం అనంతరం మృత్యువాత పడిన వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూ వస్తోంది. ఆదివారం ఉదయానికి 1,805 మంది మరణించినట్లు నేపాల్ అధికారవర్గాలు పేర్కొన్నాయి. 
 
భూకంపం కారణంగా ఆ దేశంలో 4,718 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాక శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు.. నేపాల్‌కు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ముందు వరుసలో ఉంది. భూకంపంతో కకావికలమైన నేపాల్‌కు 4 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను విమానంలో భారత్ పంపింది. సహాయక చర్యల కోసం 40 మందితో ఎన్‌డీఆర్ఎఫ్ బృందం కూడా వెళ్లింది. మెడికల్ బృందాలు, వైద్యులను వేరే విమానాల్లో పంపించారు. 

వెబ్దునియా పై చదవండి