నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. పైగా, ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహాకూటమిగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటులో శరద్ పవార్ కీలక భూమికను పోషించారు. అలాగే, జాతీయ రాజకీయాల్లో సైతం ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి కీలక నేత ఇపుడు ఉన్నట్టుండి, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
శరద్ పవార్ రాజీనామాతో ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవారే కొనసాగాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు, ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ పార్టీని చీల్చి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం గమనార్హం.