ఆర్ఎస్ఎస్ తీరుతో దేశంలో అలజడులు : నితీష్ కుమార్

సోమవారం, 22 డిశెంబరు 2014 (11:47 IST)
ఆర్ఎస్ఎస్‌కు చెందిన నేతలు అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా దేశంలో అలజడి చెలరేగుతోందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. ఇండియా అంటే హిందూ దేశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నితీష్ కుమార్ స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన పాట్నాలో మాట్లాడుతూ, మతమార్పిళ్లు వద్దంటూ ఒకవైపు ఉపన్యాసాలు ఊదరగొడుతూ, మరోవైపు ఇతర మతాలకు చెందిన వారు హిందూ మతంలోకి రావాలని ఆర్ఎస్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హిందువులను మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేయడం సరికాదన్నారు. 
 
మోహన్ భగవత్ వ్యాఖ్యలతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, 'ఘర్ వాపసీ' కార్యక్రమంతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పార్టీలన్నీ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు ఖండిస్తుండగా, బీజేపీ మాత్రం వంత పాడుతోందని నితీష్ కుమార్ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి