ఇకపై లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదు.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి : సీఎం యడ్యూరప్ప

బుధవారం, 22 జులై 2020 (12:06 IST)
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరిగినప్పటికీ ఇకపై లాక్డౌన్ అమలు చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల చేతుల్లోనే వారి ప్రాణాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ప్రస్తుతం కంటెయిన్మెంట్ జోన్లు మినహా మిగతా బెంగళూరు నగరంలో బుధవారంతో సంపూర్ణ లాక్డౌన్ ముగియనుండగా, ఇకపై ప్రజలదే బాధ్యతని, వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రనక, పగలనక పనిచేసిందని వెల్లడించిన ఆయన, వైరస్ కట్టడి ఇక తమ చేతుల్లో ఏమీలేదని అన్నారు.
 
కాగా, జూలై 14 నుంచి నగరంలో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా కేసులు తగ్గలేదు. ఇప్పటివరకూ బెంగళూరులో 33 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. "నేను ఒకటే చెప్పదలచుకున్నాను. ఇక బెంగళూరులో లాక్డౌన్ ఉండదు. రాష్ట్రంలోనూ అమలు కాబోదు. కేవలం కంటెయిన్మెంట్ జోన్లలో మాత్రమే నిబంధనలు అమలవుతాయి. ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకరించాలని కోరుకుంటున్నాను" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
 
మరోవైపు, లాక్డౌన్‌ను నగరంలో మరో 15 రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని గత మూడు, నాలుగు రోజులుగా సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు లాక్డౌన్ అమలు లేదనే విషయం తేలిపోయింది. 
 
నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మౌలిక వసతులతో పోలిస్తే, ఇప్పుడున్న కేసుల సంఖ్య ప్రభుత్వంపై ఒత్తిడిని పెట్టడం లేదని ఆయన అన్నారు. కేవలం అంబులెన్స్‌ల విషయంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు