ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు : నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారా?

వరుణ్

మంగళవారం, 4 జూన్ 2024 (08:43 IST)
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ దఫా రికార్డు సృష్టిస్తారా లేదా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ రికార్డు అధిగమిస్తారా? పవన్‌ చామ్లింగ్‌ మైలురాయి దాటుతారా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఆయనపైనే ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బిజద విజయం సాధిస్తే నవీన్‌ చరిత్ర సృష్టిస్తారని పరిశీలకులంటున్నారు.
 
మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బిజూ జనతాదళ్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్‌ 9న నవీన్‌ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్‌ సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. 
 
సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ నేత ఆయన చామ్లింగ్‌ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు. దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు ఐదుగురు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్‌ నేత లాల్‌ థధ్వాల్‌ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. 
 
అరుణాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు గెగాంగ్‌ అపాంగ్‌ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్‌ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్‌ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్‌ చామ్లింగ్‌ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు