డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కావాల్సిన పద్మావతి చిత్రాన్ని ఆ చిత్ర దర్శనిర్మాతలు వాయిదా వేసిన విషయం తెల్సిందే. మొన్నటి వరకు రాజ్పుత్ కర్ణిసేన మాత్రమే ఈ మూవీకి అడ్డుపడితే ఇప్పుడు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి, స్మృతి ఇరానీకి లేఖలు కూడా రాశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 'పద్మావతి' చిత్రానికి బాసటగా నిలిచారు. సినిమాపై కొనసాగుతున్న ఈ వివాదం చాలా దురదృష్టకరమనీ, స్వేచ్చని నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకుందని ఇది, దారుణమని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఇలాంటి హింసాత్మక చర్యలపై పోరాడేందుకు ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా నిలబడాలని దీదీ అన్నారు.
కాగా, ఇప్పటికే పద్మావతి చిత్రానికి సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, ప్రకాశ్ రాజ్, షబానా అజ్మీ, హాలీవుడ్ నటి రూబీ తమ మద్దతు తెలిపారు. పద్మావతి విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా పోరాడితే కాని ఈ సమస్యకి పరిష్కారందొరకదు అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు వాపోతున్న విషయం తెల్సిందే. మరి ఈ వివాదం ఇంకెన్నాళ్ళు సాగుతుందో చూడాలి.