కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏవిధంగా నిర్వహించాలనేది అతిపెద్ద సవాలుగా మారింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి ప్రభుత్వ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ కార్యకలాపాలను, అలాగే లోక్‌సభ హాలులో ఎగువ సభ కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్నారు.
మరోవైపు వర్చువల్ సెషన్ నిర్వహించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆగస్ట్ రెండో వారంలో కాని, మూడో వారంలో కాని వర్షాకాల సమావేశాలు జరగవచ్చని పార్లమెంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాంగ్రెస్ ఎంపిలతో సోనియా చర్చ
రానున్న ప్లారమెంట్ సెషన్‌లో లెవనెత్తబోయే ప్రధాన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో కాన్పరెన్స్ ద్వారా తమ పార్టీ లోక్‌సభ ఎంపిలతో చర్చించారు. లాక్‌డౌన్ తర్వాత కరోనాను కట్టడి చేయడంతో వైఫల్యాన్ని, ఇతర అంశాలతో పాటు సరిహద్దు వివాదంపై బిజెపి ప్రభుత్వంపై ప్రశ్నాస్తాలు సంధించేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది.
పేదలను ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలన్న డిమాండ్‌ను మోడీ సర్కార్ నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండటంపై కూడా బిజెపి ప్రభుత్వాన్ని పార్లమెంట్ సెషన్‌లో కాంగ్రెస్ లెవనెత్తే అవకాశాలున్నట్లు సమాచారం.