నవంబర్​ 18 నుంచి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు..!

గురువారం, 17 అక్టోబరు 2019 (13:40 IST)
నవంబర్​ 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్​ 18న నుంచి డిసెంబర్​ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెసుస్తోంది.
 
అయితే, అధికారికంగా ఎలాంటి షెడ్యూల్​ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గతేడాది పార్లమెంట్​ వింటర్​ సెషన్​ 2018 డిసెంబర్​ 11వ తేదీన ప్రారంభమై 2019 జనవరి 8వ తేదీ వరకు కొనసాగింది. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన సెషన్​ అదే.
 
సభ జరగనున్న కాలం, సెషన్​ సిట్టింగ్​లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్​ భేటీ అనంతరం.. అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు.
 
ఆర్డినెన్స్​లు చట్టాలుగా...!
ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని చూస్తోంది భాజపా. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్​... 'దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపు'ను చట్టంగా మార్చాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్​ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్​నూ చట్టంగా రూపొందించే అవకాశముంది. మరిన్ని కీలక బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని చూస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు