అగ్నిపథ్‌‌ను అర్థం చేసుకోండి.. పోకిరీలకు ఆర్మీలో చోటులేదు.. వీపీ

శనివారం, 18 జూన్ 2022 (10:07 IST)
అగ్నిపథ్‌ పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ సమర్థించారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న పోకిరీలను తీసుకునేందుకు ఆర్మీ ఎన్నడూ ఆసక్తి చూపదని స్పష్టం చేశారు. 
 
కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యాన్ని విజయపథంలో నడిపించిన మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ ఈ విధంగా స్పందించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనల్లో బస్సులు, రైళ్లపై దాడులకు పాల్పడుతూ గూండాయిజం చేసేవారిని భారత సైన్యం కోరుకోదన్నారు. 
 
'సాయుధ బలగాలు అనేవి స్వచ్ఛందంగా పనిచేసే బలగాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది సంక్షేమ సంస్థ కాదు. దేశాన్ని అనుక్షణం రక్షిస్తూ.. దేశంకోసం పోరాడే ఉత్తమ పౌరులు ఇందులో ఉండాలి. బస్సులు, రైళ్లు తగలబెడుతూ గూండాయిజానికి పాల్పడేవారు సాయుధ బలగాల్లో ఉండాలని మేము కోరుకోము' అని వీపీ మాలిక్‌ పేర్కొన్నారు. 
 
ఇటీవల నియామకాలను నిలిపివేసినందున పరీక్షను పూర్తిచేయని వారు ఎంతోమంది ఉన్నారన్న ఆయన.. ప్రస్తుతం వారిలో కొందరి వయసు పెరిగి ఆర్మీలో ప్రవేశానికి అనర్హులుగా మారిన మాట వాస్తవమన్నారు. ఈ విషయంలో వారి ఆందోళన, నిరాశను అర్థం చేసుకోగలనని ఆయన అభిప్రాయపడ్డారు.
 
అగ్నిఫథ్ పథకం అమల్లోకి వచ్చాక.. అందులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు