శ్రీవారి సేవలో రాష్ట్రపతి.. పుష్కరణి నీళ్లు నెత్తిన చల్లుకుని.. తొలుత వరాహ స్వామిని దర్శించుకుని

బుధవారం, 1 జులై 2015 (21:48 IST)
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్ర దర్శనం కోసం వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చాలా సాంప్రదాయబద్ధంగా వ్యవహరించారు. తిరుపతి తిరుమలలో ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు అన్నిచోట్ల ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఒకవైపు గవర్నర్ నరసింహన్, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనుండి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతి పుణ్యక్షేత్రాలను చాలా ప్రశాంతంగా దర్శించుకున్నారు. ఎవరితోనూ ఏమి పెద్దగా మాట్లాడలేదు. దైవభక్తిలో మాత్రమే ఆయన లీనమయ్యారు. 
 
రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతిలో అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల దారిలోని కపిలతీర్థంలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా తిరుమల వెళ్లారు.
 
తిరుమలలో క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రణబ్‌ ముందుగా శ్రీవరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి తితిదే ఈవో సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇస్తికపాల్‌ స్వాగతం పలికారు. మేళతాళాలతో రాష్ట్రపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. 
 
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి ఆలయ అధికారులు ఆయనకు రంగనాయక మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రణబ్ ముఖర్జి ఎస్వీబీసీ భక్తి చానెల్ తో మాట్లాడుతూ, సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు వివరించారు. అనంతరం తిరుపతి చేరుకుని రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి