రాహుల్ గాంధీ అనే నేను.. అనర్హత వేటపడిన ఎంపీని!

ఆదివారం, 26 మార్చి 2023 (11:44 IST)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాధీ తన ట్విట్టర్ ఖాతాలోని తన బయోడేటాలో స్వల్ప మార్పులు చేశారు. పరువు నష్టం దావా కేసులో తనపై అనర్హత వేటు పడిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ట్విట్టర్‌‍ బయోడేటాలో తన పేరు కింద లోక్‌సభ సభ్యుడు అనే స్థానంలో అనర్హత వేటుపడిన ఎంపీని (డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ) అని మార్చారు. 
 
దేశంలోని దొంగల పేర్లన్నీ మోడీ పేరుతోనే ఉంటాయని నాలుగేళ్ల క్రితం కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ఒకరు సూరత్ కోర్టులో వేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
ఈ శిక్ష తీర్పు వెలువడిన 24 గంటల్లోపే రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యుడుగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లోక్‌‍సభ కార్యదర్శి.. రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిజానికి ఈ తీర్పు వెలువడిన తర్వాత 30 రోజుల వరకు పైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు రాహుల్ గాంధీకి వుంది. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఆగమేఘాలపై రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీంతో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పేరును మార్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు