నేను మరో ఎంజీఆర్‌ను కాను... కానీ, ఆయనలా పాలన అందిస్తా : రజనీకాంత్ (Video)

మంగళవారం, 6 మార్చి 2018 (12:24 IST)
త్వరలో రాజకీయరంగ ప్రవేశం చేయనున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ నేతలెవ్వరూ సరిగ్గా పని చేయడం లేదనీ, అందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. అదేమయంలో ప్రస్తుతం తమిళనాడులో సరైన రాజకీయ నేత ఎవరూ లేరనీ, ఈ లోటును భర్తీ చేసి స్వర్గీయ ఎంజీఆర్ తరహాలో పాలన అందించేందుకే తాను వస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను మరో ఎంజీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
చెన్నై శివారు ప్రాంతమైన మదురవాయల్‌లోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయంలో ఎంజీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ విగ్రహాన్ని రజనీకాంత్ ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌లా మంచి పరిపాలనను అందిస్తానని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యంతో తమిళనాట రాజకీయ వెలితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం తమిళనాడుకు 'తలైవన్'‌ కావాలని, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. 
 
జయలలిత అంటే తనకు భయం లేదని, ఆమె పరిపాలనా దక్షతపై గౌరవంతోనే అప్పుడు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ నడుస్తోంది. సినీ పరిశ్రమే ఆయన పుట్టినిల్లు. ఈ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఎందుకు దూరంగా పెడుతోంది. సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదని అంటున్నారు. ఎక్కడెక్కడ తప్పు జరుగుతోందో, ఏం జరుగుతోందో నాకు తెలుసు. అందువల్లే నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను. అందరూ ఎంజీఆర్‌ కాలేరని అంటున్నారు? అవును, నిజంగానే ఎవరూ ఎంజీఆర్‌ కాలేరు. ఆయన ఒక యుగపురుషుడు. మరో వెయ్యేళ్ల వరకు అటువంటి వ్యక్తి పుట్టడు. కానీ, ఎంజీఆర్‌ ఇచ్చిన మంచి పరిపాలనను ప్రజలకు అందించగలను అని ప్రకటించారు. 
 
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నేతలతో పాటు కొందరు రాజకీయ నేతలు తనను పదే పదే ఓ విషయం అడుగుతున్నారని, సినిమా నటులు మేకప్ తీసేసి రాజకీయాల్లోకి రావడం ఎందుకని అంటున్నారని, తనకు ఇప్పుడు 67 ఏళ్ల వయసని, రాజకీయ నేతలు తమ పని సరిగ్గా చేయడం లేదు కాబట్టే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో సరైన నాయకుడు ఎవరూ లేరని, ఆ లోటును తాను భర్తీ చేస్తానని అన్నారు. ఆ దేవుడు తన వైపే ఉన్నాడని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శకమైన పాలన అందిస్తామని తెలిపారు. రాజకీయాలు అంటే అంత ఈజీ కాదని తనకు తెలుసని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

 

#WATCH: Rajinikanth addresses at Dr MGR Educational and Research Institute in Chennai https://t.co/H7iZvJ0s8O

— ANI (@ANI) March 5, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు