యమునా ఎక్స్‌ప్రెస్ వే పొడవునా రూ.6 వేల కోట్లతో 425 ఎకరాల్లో ఫుడ్, హెర్బల్ పార్కు నిర్మించేందుకు పతంజలి తలపెట్టింది. దీని ద్వారా దేశవాళీ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైఈఐడీఏ)కి ఇంకా అనుమతులు రాలేదు.
ఈ విషయం సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో మంగళవారం రాత్రి హుటాహుటిన పతంజలి వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో "చిన్నపాటి సమస్యలు" ఉన్నాయనీ.. త్వరలోనే వాటిని పరిష్కరించి అనుమతులు మంజూరు చేస్తామని రామ్‌దేవ్ బాబాకు సీఎం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన హామీలపై యోగా గురు సంతృప్తి వ్యక్తం చేసినట్టు వినిపిస్తోంది.