ముదిరిన గొడ్డు మాంసం రచ్చ.. నేను బీఫ్ తింటాను, ఎవరైనా ఆపగలరా?.. కిరణ్ రిజిజు

బుధవారం, 27 మే 2015 (10:59 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బీఫ్ రచ్చ మళ్లీ ముదిరింది. బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్తాన్ వలస వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు. తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు.
 
'నేను గొడ్డు మాంసం తింటాను. అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటా. నాతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత్ దేశంలో అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందన్నారు. బీఫ్ తినవద్దని చెప్పడానికి ఆయన ఎవరూ అంటూ నక్వీపై కిరణ్ రిజిజు విరుచుకుపడ్డారు.
 
ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే.. మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడ ఆ చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి